ఇండీ రూట్స్

27

సోమాజిగూడ మినర్వా కాఫీ షాపులో ఓ మధ్యాహ్నం టిఫిన్ చేద్దామని అడుగుపెట్టగానే నా మిత్రురాలొకామె చాలారోజుల తర్వాత కనిపించింది. మేమిద్దరం కుశలప్రశ్నలమీంచి మా పాతజ్ఞాపకాలు నెమరేసుకున్నాం. మాటలమధ్యలో, మేమొకప్పుడు, చార్మీనార్ దగ్గర చీరలమీద అద్దకం చేసే బ్లాక్ ప్రింటింగ్ కళాకారుల్ని వెతుక్కున్న ఒక సాయంకాలాన్ని కూడా తలుచుకున్నాం. ఆ అద్దకం గుర్తురాగానే ఆమె ‘మీకో గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను రండి’ అంటో, ఆ షాపింగ్ కాంప్లెక్సు మొదటి అంతస్థులోకి తీసుకువెళ్ళింది. మెట్లెక్కగానే మొదటిషాపే.

ఇండీ రూట్స్.

పేరు గమ్మత్తుగా ఉందే అనుకుంటూ లోపల అడుగుపెట్టగానే, అదొక షాపులాగా కాక, ఒక కళాకేంద్రం లాగా కనిపించింది. ఆ షాపు నడుపుతున్న అభిషేక్ ముజుందార్ ని నా మిత్రురాలు పరిచయం చేసింది. ఆ తర్వాత గంటసేపో, గంటన్నరో ఆ బెంగాలీ యువకుడు నా కళ్ళముందొక వస్త్రప్రపంచాన్ని, కళాకారుల రంగుల కలల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోనే ఉన్నాడు. ఇద్దరమూ ఆఫీసులకి వెళ్ళాలి కాబట్టి, అతి కష్టం మీద బయటకు వచ్చాం కాని అతడితో అన్నాను, ‘చేనేత గురించి తెలుసుకోవడానికి ఒక సెలవురోజు మీదగ్గరికొచ్చి తీరిగ్గా గడుపుతాను’ అని.

కాని, ఆ సెలవు రోజు రాకుండానే మళ్ళా ఆ దుకాణానికి వెళ్ళవలసి వచ్చింది. మా సంస్థ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వస్తున్న అచ్యుత సమంత కి జ్ఞాపికగా ఏమిస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు, నేను మా సంస్థ డైరక్టరుగారికి ఇండీ రూట్స్ గురించి చెప్పాను. మళ్ళా మా ఆఫీసు బృందంతో ఆ షాపు మరోమారు సందర్శించాను. మేము ఆహ్వానించిన వ్యక్తి గిరిజన ప్రేమికుడని తెలియగానే, అభిషేక్, ఆయనకోసం డోక్రా తెగవారు పోతపోసిన మిశ్రలోహ విగ్రహాన్ని ఒకటి మాకు చూపించాడు. ఒక పడవ, ఇద్దరు నావికులు. చాలా అందంగా ఉంది, ‘పడవ బొమ్మ’ అన్నారెవరో. ‘కాదు, టీం వర్క్’ అన్నాడు అభిషేక్.

ఇండీరూట్స్ ఆసక్తి కరమైన ఒక స్టార్ట్ అప్. యువతీయువకులు ఔత్సాహికులైన ఎంటర్ ప్రెన్యూర్లుగా మారాలని కోరుకునేవాళ్ళకి ఈ ప్రయోగం ఒక నమూనా పాఠం. అభిషేక్ ఎక్స్.ఎల్.ఆర్.ఐ లో ఎం.బి.ఏ చేసాడు. కొన్నాళ్ళ పాటు నోవాటిస్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం చేసాడు. కాని తన శక్తిసామర్థ్యాల్ని పూర్తిగా వినియోగించుకునే రంగం అది కాదని అతడికి అర్థమయింది. అతడిది స్వస్థలం బెంగాల్లో శాంతినికేతనం. చిన్నప్పటినుంచీ శాంతినికేతనం చుట్టుపక్కల గ్రామీణ హిందూ, మహ్మదీయ కుటుంబాలు మేలిమి వస్త్రాలు నేస్తూండటం అతడు చూస్తూ వచ్చాడు. ఏడెనిమిది నెలలపాటు ఒక కుటుంబమంతా ఒక చీర నేత నేస్తే, అది మార్కెట్ కి వచ్చేటప్పటికి పదిహేనువేలనుంచి ఇరవై వేలదాకా పలుకుతుంది. కాని నేతకారులకి అందేది మహా అయితే, వెయ్యి లేదా రెండువేలు. అన్ని ఉత్పత్తి రంగాల్లో జరిగినట్టే, ఇక్కడ కూడా లాభాలన్నీ దళారీలకే. అలా కాకుండా, ఆ నేత ప్రతిఫలం నేతకారులకే అందాలంటే ఏం చెయ్యాలి? ప్రభుత్వాలు చేనేతకారుల సహకారసంఘాలు ఏర్పరచి చెప్పుకోదగ్గ కృషి చేస్తూండకపోలేదు. కాని ఆ సంఘాలు లేదా ప్రభుత్వ కార్పొరేషన్లు మేలిమి నేతవస్త్రాల మీద దృష్టి పెట్టవు. వాళ్ళు ప్రోత్సహించే నేతకారులు మిల్లునమూనా ని పాటించి మాస్ ప్రొడక్షన్ చేస్తూంటారు. అందువల్ల, ఆ వస్త్రాల్లో భారతీయ చేనేతలోని అద్భుతమైన వారసత్వం, సున్నితమైన నేత, జరీ, కలంకారీ కనిపించవు. అత్యున్నత స్థాయి చేనేత వస్త్రాల కొనుగోలు దాదాపుగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంది. అభిషేక్ ఆలోచించిందేమిటంటే, తాను నేరుగా నేతకారుల నుంచి ఆ మేలిమి వస్త్రాల్ని సేకరించి, నేరుగా అమ్మిపెట్టినట్టయితే, ఒకటి, ఆ వస్త్రాలు మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరలో వినియోగదారులకి అందించగలుగుతాడు, రెండు, ఆ లాభంలో న్యాయమైన వాటా నేతకారులకి నేరుగా ముట్టచెప్పగలుగుతాడు.

ఈ ఉద్దేశ్యంతో ఇండీ రూట్స్ ప్రారంభించాడు. ఒకప్పుడు భారతీయ నేతవస్త్రాలు ఈజిప్టుదాకా, మధ్యయుగాల్లో యూరోప్ అంతటా ప్రయాణించేవంటే, అందుకు కారణం కేవలం ఉత్పత్తి-కొనుగోలు సంబంధం కన్నా, అభిరుచిమీద నిర్మించిన సాంస్కృతిక అనుసంధానమే ముఖ్యంగా ఉండేది. ఆధునికకాలంలో పారిశ్రామికీకరణ వచ్చినతరువాత, మాంచెష్టర్, లంకాషైర్ మిల్లుల కోసం ఈస్టిండియా కంపెనీ భారతీయ చేనేతను ధ్వంసంచెయ్యడానికి చేపట్టిన మొదటి చర్య, ఆ అభిరుచి బంధాన్ని ఎక్కడికక్కడ తెంపేస్తూ రావడమే. ఇప్పుడు భారతీయ సంస్కృతినీ, ఆర్థికవ్యవస్థనీ పోషిస్తున్న మధ్యతరగతికి విలువైన భారతీయ చేనేత సంప్రదాయాల గురించి ఏమీ తెలీదు. మనకి అభిరుచి ఏర్పడలేదుకాబట్టి మనకి సంస్కృతి కూడా లేదు. (అందుకనే, మనకి తెలిసిన, మనం పంచుకోగలిగిన ఏకైక సంస్కృతి సినిమాలు మటుకే.)

అభిషేక్ పోరాటం ఈ సమస్యతోనే. అందుకని,అతడి షాపులో అడుగుపెట్టగానే, అతడు చేసే మొదటిపని, ఒక్కొక్క చీరెనీ, దుపట్టానీ, శాలువా నీ చూపిస్తూ, విశిష్టమైన భారతీయ చేనేత సంప్రదాయాల గురించి మీకు ఓపిగ్గా వివరించడం మొదలుపెడతాడు. అతణ్ణి వింటూంటే మీరొక షాపులో ఉన్నారనుకోరు. ఏదో ప్రతిష్టాత్మకమైన డిజైన్ ఇన్స్టిట్యూట్ లో పాఠం వింటున్నట్టుంటుంది. విష్ణుపూర్ పట్టు చీరలు, భారతీయ పురాణగాథల్ని నేతనేసే బాలూచూరీ చీరలు, ఫూలియా ప్రాంతపు నేతకారులు నేసే జమ్ దానీ కాటన్, కేరళలో కుథంపల్లి నుంచి వచ్చే టిష్యూ నేతవస్త్రాలు, కోయంబత్తూరు, శంబల్ పూర్ కాటన్, బందరు, కాళహస్తి, పెడన కలంకారీ, పోచంపల్లి ఇకత్, మధుబని, కూచ్ బిహార్ డిజన్లు, మైసూరు, ఘీచా పట్టు- మొత్తం భారతదేశవస్త్రవైభవమంతా అక్కడ మీకు నమూనాగా కనిపిస్తుంది. శాంతినికేతన్ లో టాగోర్ కాలం నాడు ఎలా నేసేవారో, ఇప్పటికీ అలానే నేసే పూర్తి బాతిక్ చేనేత వస్త్రాలు అక్కడ కనిపిస్తాయి.బెంగాల్లో గ్రామాల్లో బయటకి వెళ్ళడానికి ఆంక్షలుండే ముస్లిం స్త్రీలు ఇంటిపట్టునే ఎనిమిది తొమ్మిది నెలలపాటు నేస్తుండే కాంథానేత వస్త్రాలు అక్కడ ప్రత్యేకమైన ఆకర్షణ. మనం చిన్నప్పుడు చదువుకున్న డక్కా మస్లిన్ చీరలు అక్కడ చూసాను. ఎనిమిదిగజాల మస్లిన్ చీర నా కళ్ళముందే అభిషేక్ ఒక ఉంగరంలోంచి బయటకు తీసి చూపిస్తే, అర్థమయింది, ఈస్టిండియా కంపెనీ ఆ నేతకారుల అంగుళులమీద ఎందుకంత కక్షగట్టిందో.

ఇండీ రూట్స్ షాపుకి ఇప్పటిదాకా మూడుసార్లు వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారీ, భారతీయ నేతకారులకి కైమోడ్చకుండా ఉండలేకపోయాను. ఆకలికడుపులతో, చితికిన బతుకులతో, అతికిన మగ్గాలమీద వాళ్ళెంత అద్భుత, నిష్కళంక సౌందర్యాన్ని నేస్తున్నారో చూడగానే ఈ దేశసంస్కృతి పట్ల గర్వం, కాని, మన ఉదాసీనతని తలుచుకుని సిగ్గూ ఒక్కసారే కలిగేయి. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివెర్సిటీలు లాంటి వివిధ పాలనాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులకి సమాజం అన్నిరకాల వసతులూ కల్పిస్తోంది. వాళ్ళు చేస్తున్న పనిని కూడా ఒక నేతవస్త్రంతో పోలిస్తే, ఆ నేత ఎంత మోసకారిగా, ఆత్మద్రోహ పూరితంగా ఉంటోంది! కాని కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని ఆ నేతకారుల చేనేత ఎంత పరిపూర్ణంగా, సముజ్జ్వలంగా ఉంటోంది!

అత్యంత మేలిమి, కళాత్మక భారతీయ చేనేతవస్త్రాల్ని ఇండీరూట్స్ మార్కెట్ కన్నా చాలా తక్కువ ధరలకి అందిస్తోంది. ‘మీరు మార్కెట్ ధరకే అందిస్తే నేతకారులకి మరింత ప్రతిఫలం అందుతుంది కదా’ అంటే, అభిషేక్ చెప్పేదేమంటే, ముందు తాను అభిరుచి పెంపొందించడం మీద దృష్టి పెడుతున్నాననీ, మార్కెట్ తో పోలిస్తే, చాలా తక్కువధరకి ఇస్తే తప్ప, వినియోగదారుల్ని ఆకర్షించలేననీ, తాను ఆశించిన స్థాయికి ఇండీ రూట్స్ చేరినప్పుడు, వినియోగదారుడి వ్యక్తిగతమైన అభిరుచిని బట్టి నేతకారులు వస్త్రాలు నేసే రోజు రాగలదనీ అన్నాడు. ఇప్పుడతడు ఒక వెబ్ సైట్ నడుపుతున్నాడు, బ్లాగ్ కూడా మొదలుపెట్టాడు. తమ దగ్గర వస్త్రాలు కొన్నవాళ్ళతో ఇండీఫాన్స్ అనే ఒక చిన్న గ్రూపుని కూడా తయారు చేసుకుంటున్నాడు. చేనేతతో పాటు, మట్టిపాత్రలు, పంచలోహ విగ్రహాలు, దారుశిల్పాలు కూడా సేకరించి ప్రజాసామాన్యానికి పరిచయం చెయ్యడం మొదలుపెట్టాడు.

అభిషేక్ ఇండీ రూట్స్ ని ఎలానూ అభివృద్ధి చేస్తాడు, రానున్న రోజుల్లో ఇట్లాంటి అభిరుచి వారధులు, సారధులు మరెందరో ముందుకొస్తారని ఆశపడుతున్నాను.

14-7-2017

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: