ప్రపంచం రెండు విధాలుగా ఉంది. చుట్టూ ఉన్న వ్యవస్థల్ని విమర్శిస్తూ వుండే ప్రపంచమొకటి. ‘చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూచోకుండా ప్రయత్నించి చిన్నదీపమేనా వెలిగించే’ వాళ్ళ ప్రపంచం మరొకటి. కిరణ్ మధునాపంతుల ఈ రెండో తరహా ప్రపంచానికి చెందిన మనిషి.
ఆయన తాను పుట్టిన ఊరు పల్లిపాలెం కోసం ఏదన్నా చెయ్యాలనుకుని ఒక చిన్న పాఠశాల మొదలుపెట్టి, అప్పుడే పదేళ్ళయిపోయింది. నిన్న పదవవార్షికోత్సవానికి రమ్మని పిలిస్తే వెళ్ళాను. నాతో పాటు పిల్లలప్రేమికుడు సి.ఏ.ప్రసాద్ గారు కూడా ఆ వేడుకల్లో పాలుపంచుకుంటూ ఉన్నారు.
బాలలకోసం,ముఖ్యంగా బీదబాలలకోసం, ఈ ప్రపంచం మరికొంత సౌకర్యంగా ఉండాలని అహరహం తపించే ‘పడాల చారిటబుల్ ట్రస్ట్’ ప్రసాద్ గారూ, ‘క్రియ’ జగన్నాథరావుగారూ కూడా ఆ వేడుకల్లో భాగం పంచుకున్నారు.
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి చాలా అందంగా ఉంటుంది. పల్లిపాలెం లాంటి ఊళ్ళో మరీను. కాని ఈసారి సంక్రాంతి ఫిబ్రవరి మొదటివారందాకా కూడా జరుగుతున్నట్టనిపించింది ఆ ఊళ్ళో అడుగుపెట్టగానే.
తూర్పుగోదావరి జిల్లాలో పల్లిపాలెం చాలా ప్రత్యేకమైన ఊరు. నేనొకప్పుడు ఆ ఊరు గరించి రాస్తూ అక్కడ సాహిత్య సత్త్రయాగం జరిగేదని రాసేను.
యాగాలు మామూలుగా ఒక రోజు ఒక రాత్రి నిడివితో మొదలై రాజసూయం, అశ్వమేథంలాగా ఏడాది పాటు కూడా జరిగేవి ఉండేవి. కాని సత్త్రయాగం అలాకాదు. అది నిరంతరాయంగా జరిగే యాగం. కొందరు పన్నెండేళ్ళ పాటు జరిగేవి అంటారుగాని, సత్త్రయాగాలకి కాలపరిమితి లేదు. అందుకనే యాత్రీకులకీ, భిక్షార్థులకీ అన్నం పెట్టే ఉచితాన్నశాలలని సత్త్రాలని పిలిచేవారు. సాహిత్యానికి సంబంధించి పల్లిపాలెం అట్లాంటి ఒక సత్త్రం.
ఇప్పుడు అక్కడ కవిత్వం చెప్తున్న మధునాపంతుల సత్యనారాయణమూర్తి ముత్తాతగారు మధునాపంతుల సూర్యనారాయణమూర్తి. ఒకప్పుడు తిరుపతి వెంకట కవులకీ, వేంకట రామకృష్ణ కవులకీ మధ్య వివాదం వచ్చింది. వేంకట రామకృష్ణకవులు పిఠాపురం మహారాజా ఆస్థాన కవులు. వారిలో వేంకటరామశాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి గురువు కూడా. ఆ రామశాస్త్రి తనకి శిష్యుడని చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి ఎక్కడో ప్రస్తావించేరట. దానికి కోపం తెచ్చుకుని తాను ఆయన శిష్యుడేమిటని రామశాస్త్రి పద్యాలు రాసేరు. ఆ వివాదం తెలుగుసాహిత్య చరిత్రలో గొప్ప వివాదం మాత్రమే కాదు, వారం వారం ఆంధ్రపత్రికలో ఆ విశేషాలు చదివి ఒక తరం తరం మొత్తం సాహిత్య విద్యావంతులయ్యారు. ఆ వివాదంలో తమకి రామశాస్త్రి శిష్యుడని చెప్పడానికి చాలామందే సాక్షులున్నారని చెప్తూ వేంకటశాస్త్రి ‘మధునపంతుల సూరయ్య బుధుడు సాక్షి’ అని చెప్పారు.
ఆ సూరయ్యగారి కుమారుడు మధునాపంతుల సత్యనారాయణ మూర్తి. ఆయన పిల్లల్లో పెద్దపిల్లవాడు ఆంధ్రులకొక పురాణాన్ని కానుకచేసిన మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి.ఆయన ‘ఆంధ్రి’ అనే ఒక పత్రిక నడిపారు కూడా. అందువల్ల పల్లిపాలెంలో ఆ ఇంటికి ఆంధ్రీకుటీరమని కూడా పేరు వచ్చింది. ఆధునిక తెలుగుసాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ కవులూ, పండితులూ ఎందరో ఆ ఇంట్లో అడుగుపెట్టి, ఆ కుటీరంలో ఒక్కసారైనా సాహిత్యచర్చ చేసినవారే. ఆ ఇంటి వెనక పరుచుకున్న వరిపొలాల మధ్య పచ్చటి మామిడి చెట్టు ఒకటి ఇప్పటికీ నిండుగా కనిపిస్తుంది. ‘అదే పురాణవృక్షం’ అన్నాడు నిన్న సత్యనారాయణ మళ్ళా ఆ చెట్టు చూపిస్తూ. ఎందుకంటే ఆ చెట్టుకింద కూచునే మధునాపంతుల ‘ఆంధ్రపురాణం’ రాసేరు.
సత్యనారాయణశాస్త్రిగారి తమ్ముడు సూరయ్యశాస్త్రి అచ్చమైన మనిషి. సంస్కృత లాక్షణికులు ఎట్లాంటి సహృదయుడిగురించి మాట్లాడేరో, అట్లాంటి సహృదయులు- నాకు తెలిసి ఇద్దరే, ఒకరు శరభయ్యగారు, రెండోది సూరయ్యశాస్త్రిగారు. నా ‘పునర్యానం’ కావ్యం చదివి ఆయన నాకు రాసిన ఉత్తరాన్ని మించిన పురస్కారం నాకు మరేదీ లేదనిపిస్తుంది.
సూరయ్యగారి శాస్త్రి ఇద్దరు కుమారుల్లో సత్యనారాయణమూర్తి కోలంక హైస్కూల్లో తెలుగు పండితుడిగా పనిచేసి పదవీవిరమణ చేసాడు. ‘పరంపర’ అనే పేరిట ఒక కవితాసంపుటి కూడా వెలువరించాడు. ఇప్పుడు వాళ్ళమ్మాయి రత్నకళిక తెలుగు సాహిత్యంలో పరిశోధన చేస్తూ ఉంది.
ఈ సాహిత్య వంశచరిత్ర ఎందుకు రాసానంటే, ఇప్పుడు సూరయ్యశాస్త్రిగారి రెండవ కుమారుడు మధునాపంతుల చలపతి, అతడి శ్రీమతి నళిని పల్లిపాలెంలో మధునాపంతుల ఫౌండేషన్ నెలకొల్పిన పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇంతదాకా సాహిత్యంలో సత్త్రయాగం చేసిన ఆంధ్రీకుటీరం ఇప్పుడు విద్యావితరణ మొదలుపెట్టిందన్నమాట.
మధునాపంతుల కిరణ్ నెలకొల్పిన కోమేక్ ఐటి ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ సేవలందిస్తున్న సంస్థ. ఆ సంస్థలో కిరణ్ బృంద సభ్యులు కూడా ఎనిమిదిమంది ఆ వేడుకలకి రావడం నాకెంతో సంతోషమనిపించింది. గ్రామాలకు తరలివెళ్ళడమంటే ఇలా కదా అనిపించింది.
ఆ వేడుకల్లో నన్ను వాళ్ళమధ్యకు ఆహ్వానించినందుకు ఆ పాఠశాల అభ్యున్నతి కోసం నేను చేయగల సూచనలు కూడా కొన్ని చేసాను. కాని, ఆ నేలలో ఉన్న జవం, జీవం, ఆ సంతతి అందిపుచ్చుకున్న వారసత్వం, ముఖ్యంగా ఆ పాఠశాలమీద నమ్మకం పెట్టుకున్న 138 మంది చిన్నారుల తల్లిదండ్రులు ఆ పాఠశాలను రానున్న రోజుల్లో గొప్ప ప్రదీపశాలగా మార్చనున్నారని నాకు చాలా బలంగా అనిపించింది.
5-2-2017
Hi nice reading yourr blog