అమృత షెర్-గిల్

53

ఢిల్లీలో క్రాఫ్ట్స్ మూజియం చూసిన తరువాత, ఆధునిక భారతీయ చిత్రకారులంతా కోరుకునే గమ్యస్థలి, నేషనల్ గాలరీ ఆఫ్ మాడరన్ ఆర్ట్ కూడా చూసాం.

రాజస్థాన్ పింక్ స్టోన్ తో కట్టిన జైపూర్ హౌస్ లో అడుగుపెడుతూనే ప్రాంగణంలో మరీ అంత ఆకర్షణీయంగా లేని వింకారోజియా పూలవరసలు. బయట ఎండకి ఎండి వానకి తడుస్తున్నట్టున్న శిల్పాలు. దాదాపు ఎనిమిది ఎకరాల స్థలంలో, 1954 లో జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలో అప్పటి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించిన చిత్రశాల.

2009 లో కొత్తగా కట్టిన భవనంలో ఆధునిక భారతీయ చిత్రకళా ప్రదర్శన. లోపల అడుగుపెడుతూనే ఎదురుగా ఆర్ట్ షాప్. ప్రసిద్ధి చెందిన ప్రతి భారతీయ చిత్రకారుడి చిత్రలేఖనాల ప్రింట్లు, కొందరి మీద రచనల్తో పాటు, చిత్రలేఖనాల ప్రింట్లతో రూపొందించిన కాఫీ కప్పులు, మౌస్ పాడ్ల వంటివి కూడా అమ్మకానికి ఉన్నాయి.

ఆధునిక భారతీయ చిత్రకళా పరిణామాన్ని ప్రతిబింబించే ప్రదర్శన పైన నాలుగు అంతస్తుల గాలరీలో ఉంది. మెట్లెక్కి అటు పోవాలనుకునే లోపు, కిందనే, అనూహ్యంగా, విస్మయకారకంగా, అమృత షెర్-గిల్ చిత్రప్రదర్శన.

అమృత షెర్-గిల్!

నా పసితనంలో ఆ పేరు నన్నొక అనిర్వచనీయ లోకానికి తీసుకుపోయేది. మా తాడికొండ గురుకుల పాఠశాలలో మా ప్రిన్సిపాలు శ్రీమతి కె.ఎం.సుగుణగారు కొన్ని భారతీయ చిత్రలేఖనాల ప్రింట్లు తెప్పించి పటాలు కట్టించి మా డైనింగ్ హాల్లో, డార్మిటరీల్లో, లైబ్రరీలో పెట్టించారు. కె.కె.హెబ్బర్, రామ్ కుమార్ (మరికొందరి పేర్లు ఇప్పుడు గుర్తు రావడం లేదు) లతో పాటు అమృత షెర్-గిల్ చిత్రాలు కూడా.

బహుశా రెండు ఉండేవనుకుంటాను. వాటిలో నేనెప్పటికీ మర్చిపోలేనిది Three Sisters (1935). బాగా కొట్టొచ్చినట్టు కనబడే ఎరుపు, తెలుపు రంగుల్లో నిశ్శబ్దంగా కూచుండే ముగ్గురు అక్కచెల్లెళ్ళు. వాళ్ళని ఆవరించి చెప్పలేని విషాదం. వాళ్ళొకరినొకరిని అంటిపెట్టుకుని కూచున్నా, వాళ్ళ మధ్య ఎంతో దూరం. ఎవరి ఏకాంతంలో వాళ్ళు. ఆ స్కూల్లో నాకులానే. చదువులోనూ, పోటీలోనూ నా సహాధ్యాయులందరితోనూ ఎంతో కలిసి మెలిసి మసిలినా, నా హోమ్ సిక్ నెస్ లో, నేనొంటరిగా మిగిలిపోయినట్టే.

ఆ బెంగలో, పసితనపు ఆ ఏకాంతంలో అమృత షెర్-గిల్ అనే పేరు, ఆ బొమ్మా నా నేస్తాలు. టాగోర్ The Post Office రూపకంలో ఆ పిల్లవాడికి బయటి ప్రపంచానికీ మధ్య సేతువులాగా ఉండే కిటికీ లాగా ఆ బొమ్మ కూడా నాకూ, నా ఏకాంత లోకానికీ మధ్య తెరిచి ఉన్న కిటికీ లాగా ఉండేది.

ఆ తర్వాత అమృత గురించి చాలానే చదివాను, ఆ బొమ్మల్ని కూడా పుస్తకాల్లో చూసేను గాని, ఆ కృతుల్ని, ఆ ఒరిజినల్స్ ని ఇట్లా చూడగలనని ఎన్నడూ అనుకోలేదు. ‘అమృత షెర్ గిల్: ఒక కాంక్షాభరిత అన్వేషణ’ అనే పేరిట ఆ ప్రదర్శనని పోయిన ఏడాది రూపొందించారుట. మరొకసారి మళ్ళా ప్రదర్శనకు పెట్టారు. అమృత జీవితంలోని వివిధ దశల్ని, ఆమె స్వీకరించిన వివిధ ప్రభావాల్ని చూపిస్తూ, ఆమె పరిణత దశలో చిత్రించిన చిత్రలేఖనాలతో ఆ అన్వేషణాయాత్రను క్యురేట్ చేసారు.

అమృత షెర్ గిల్ (1913-1941) ఆధునిక భారతీయ చిత్రకళా గగనం మీద కొద్దికాలం పాటు మటుకే వెలిగినా ఎంతో తీక్ష్ణంగానూ, ఉద్విగ్నంగానూ వెలుగొందిన తార. జీవించింది 28 ఏళ్ళు మటుకే. కాని, తన సమకాలిక ప్రపంచం నుంచి ఎంత స్వీకరించగలదో అంతా స్వీకరించింది, చిరకాలం నిలవగల సృజనలోకాన్ని నిర్మించి వెళ్ళిపోయింది.

20 వ శతాబ్దంలో భారతీయ చిత్రకళ సాగించిన ప్రయాణంలో అమృత షెర్-గిల్ ఒక అందమైన దీవి. ప్రకాశవంతమైన రంగులు, ధూళిధూసరితమైన గ్రామీణవదనాలు, లోపల ఘూర్ణిల్లుతున్న మోహావేశాల్ని బయటికి వ్యక్తపరచడానికి ఏ చరిత్ర మలుపుల్లోంచో తెచ్చుకున్న వక్రరేఖలు, లయ, అనుపశమిత సృజనోత్సాహంతో నిండిన ఒక దీవి.

ఆమె బెంగాల్ స్కూల్ కి చెందింది కాదు, బొంబాయి స్కూల్ కి చెందింది కాదు, progressive కాదు, idyllic కాదు, ఆమె అద్వితీయురాలు, వెయ్యేళ్ళ కాలంలో ఎవరికోగాని అరుదుగా లభించని అవకాశం ఆమెకి దొరికింది. ప్రాక్పశ్చిమాల మధ్య సేతువు కట్టిందామె. సాహిత్యంలో ఒక తోరూదత్, చిత్రలేఖనంలో ఒక అమృత షెర్-గిల్, అంతే.

ఒక సిఖ్ఖు తండ్రికీ, హంగేరియన్ తల్లికీ పుట్టిన బిడ్డ. టాగోర్ తన ఇంట్లో ఒక్కడూ కవితలు రాసుకుంటూ కొట్టివేతల మధ్య చిత్రలేఖనాన్ని సందర్శిస్తున్న వేళలోనే, ఆమె తల్లి ఆమెను చిత్రలేఖనం నేర్పించడానికి పారిస్ తీసుకువెళ్ళింది.

తొలిచిత్రాల్లో ఆమె మీద ఐరోపీయ చిత్రలేఖకుల ప్రభావం ఉందని విన్నానుగాని, ఆ ప్రభావం ఎంతో వైవిధ్యవంతంగానూ, స్ఫుటంగానూ ఉందని ఆ బొమ్మలు చూస్తే అర్థమయింది. పోస్ట్ ఇంప్రెషనిస్టు చిత్రకారుడు పాల్ గాగిన్ (1848-1903) ప్రభావం షెర్ గిల్ చిత్రించిన మానవదేహాకృతుల మీదా, గాఢమైన రంగుల మీదా సుస్పష్టమే. కాని షెజానె (1839-1906) తరహాలో కూడా ఒకటి రెండు చిత్రాలు లేకపోలేదు. కాని నన్ను బాగా ఆశ్చర్యపరిచింది ప్రసిద్ధ డచ్చి చిత్రకారుడు పెద్ద బ్రూగెల్ (1525-1569)ని కూడా అనుసరిస్తూ ఆమె చిత్రించడం. హంగేరియన్ అంగడివీథిని (1938) చిత్రించిన దృశ్యం పూర్తిగా బ్రూగెల్ తరహా చిత్రం. తర్వాత రోజుల్లో చిత్రించిన Ancient Story Teller (1940) లో కూడా బ్రూగెల్ కనిపిస్తాడుగాని, ఈసారి పర్షియన్ మీనియేచర్ల ప్రభావంతో మిళితమైపోయాడు.

పారిస్ ఆమెని ఎక్కువ పట్టిఉంచలేకపోయింది. కొన్నాళ్ళు హంగరీలో గడిపాక, 1934 లో భారతదేశానికి పయనమయ్యింది. ‘యూరోప్ పికాసో, మాటిస్సే, బ్రేక్ లాంటి చిత్రకారులది, భారతదేశం మాత్రం కేవలం నాకోసమే వేచి ఉంది’ అని రాసుకుందామె.

ఆ తర్వాత జరిగిందంతా చరిత్ర. 35 నుంచి 41 దాకా ఏడేళ్ళ పాటు ఆమె ఐరోపీయ తైలవర్ణ చిత్రకారుల కృషినీ, గాగిన్, షెజానె, వాన్ గో లనూ మొఘల్, పహారీ మీనియేచర్ చిత్రకళతోనూ, ఎల్లోరా గుహాశిల్పాల దారుఢ్యంతో మేళవించి, అజంతా కుడ్యచిత్రాల్లో తనదైన శైలిని దర్శించగలిగింది. ఆ ఏడేళ్ళ కాలంలో ప్రాక్పశ్చిమాలకు చెందిన సంప్రదాయ నవ్య రీతుల జమిలినేతలో ఆమె చిత్రించిన చిత్రాలు ఒక జామినీ రాయ్ కీ, ఒక రవీంద్రనాథ టాగోర్ కీ సమానంగా ఆమెను నిలబెడతాయి. కాని ఆ మహనీయ కళాకారులు జీవితకాలపు సాధనలో పండిన తరువాత సాధించిన ఆ దర్శనం ఆమె ఇంకా తొలియవ్వనం దాటకుండానే సాధించగలిగిందని మనం మర్చిపోకూడదు.

మట్టిరంగుల నేపథ్యంలో, muted backgrounds మీద, ఎరుపు, తెలుపులతో ఆమె చిత్రించిన వర్ణ చిత్రాల్లో గాఢత, గూడుకట్టుకున్న వేదన, ఆపుకోలేని ఉత్సాహం, ఒక అభిశప్తత కూడా కనిపిస్తాయి. అజంతా శైలిలో ఆమె చిత్రించిన The Bride’s Toilet (1937), Brahmacharis (1937) లలో ఆమె సర్వోత్కృష్టమైన పరిణతి సాధించింది. ఆ బాలికకు భారతదేశం తనను తాను పూర్తిగా ఎరుకపర్చుకుంది.

‘చిత్రకళలో బెంగాల్ స్కూలనీ, బొంబాయి స్కూలనీ ఉండదు, ఉండేదల్లా మంచి బొమ్మలూ, చెడ్డ బొమ్మలూ మాత్రమే’ అందామె. 1937 లో ‘చిత్రకళా ప్రశంస’ అనే వ్యాసంలో ఆమె మంచి చిత్రకళకీ, చెడ్డ చిత్రకళకీ మధ్య తేడా ఏమిటో విస్పష్టంగా చెప్పింది. మంచి చిత్రకళ చూడగానే చప్పున ఆకట్టుకోదు సరి కదా, తొలిచూపులో ఒకింత విముఖత కూడా కలిగిస్తుందనీ, చెడ్డ చిత్రకళ అట్లా కాకుండా చక్కెరపూతతో మైమరింపచేస్తుందనీ అందామె. మంచి చిత్రకళకి మూడు లక్షణాలుంటాయని చెప్పింది. మొదటిది, అది చూస్తున్న దృశ్యాన్ని, లేదా వస్తువుని సరళీకృతం చేస్తుంది. రెండవది, చిత్ర సౌందర్యం వస్తువు మీద కాక, ఆ వస్తుభాగాల అమరికమీదా, ఆ అమరికను చిత్రించగల సాంకేతిక ప్రజ్ఞమీదా ఆధారపడుతుంది. ఇక, అన్నిటికన్నా ముఖ్యం, దానిలో ఒక దారుఢ్యం, శక్తీ ద్యోతకమవుతూంటాయి.

ముఫ్ఫై ఏళ్ళు నిండకుండానే ఈ దార్శనిక స్పష్టత ఆమెకెట్లా సాధ్యపడింది? ప్రగాఢ జీవితేచ్ఛ, స్త్రీలతోనూ, పురుషులతోనూ కూడా జీవితాన్ని తనివితీరా పంచుకోవాలన్న మహామోహవ్యాకులత ఆమె రంగుల్లోనూ, రేఖల్లోనూ అంత తీవ్రంగా ఎట్లా పొంగిపొర్లాయి?

ఆ చిత్రాల్లో భరించలేనంత భౌతికత, తనను తాను తట్టుకోలేక ఆత్మికతలోకి విరిగిపోయిన భౌతికత. తన మిత్రుడూ, ప్రోత్సాహకుడూ కార్ల్ ఖండేల్ వాలా కు రాసిన ఉత్తరంలో ఆమాటే రాసిందామె:

‘కళ మొత్తం నా దృష్టిలో ఒక ఐంద్రియకత, ఆ ఐంద్రియకత ఎంత తీవ్రమైందంటే అది కేవల భౌతిక ప్రపంచపు హద్దుల్లో ఇమడలేక పొంగిపొర్లిపోయేటంత భౌతికత’.

3-1-2015

arrow

Painting: ‘The Bride’s Toilet’, Amrita-Shergil
ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

 

 

Leave a Reply

%d bloggers like this: