మనముందున్న చిత్రలేఖనం చూడండి. మామూలుగా మనం దాన్ని పట్టించుకోం. కాని అది, ప్రపంచ ప్రసిద్ధి చెందిన అత్యున్నతశ్రేణి చిత్రకారుల్లో ఒకడైన సై టొంబ్లీ (1928-2011) చిత్రించిన చిత్రమని చెప్పినప్పుడు మనమొకనిమిషం దాన్ని మరింత పరికించి చూస్తాం. ఆ చిత్రానికి అతడు Aristaeus mourning the loss of his bees (1973) అని పేరుపెట్టాడన్నప్పుడు మరింత ఆగి చూస్తాం. అప్పుడు ఆ చిత్రం గురించి మనకేమైనా వివరించిచెప్పగల విమర్శకుడికోసం వెతుక్కుంటాం. అరిస్టేయియస్ గ్రీకు పురాణగాథల్లో తేనెటీగలకి అధిపతి అనీ, అతడు యూరిడైస్ ని మోహించి వెంటపడటంలో తన తేనెటీగల్ని కాపాడుకోలేకపోయాడనీ,అందువల్ల దేవతల ఆగ్రహానికి గురయ్యాడనీ, అందువల్ల ఈ చిత్రలేఖనం పశ్చాత్తాపానికీ, శోకానికీ చిహ్నమనీ, ఇందులో రాతలూ, గీతలూ సమాంతరంగా ఉన్నందువల్ల చిత్రానికొక ప్రగాఢ శాంత లక్షణం సమకూరిందనీ, ఎందుకంటే, శోకం చిట్టచివరికి మనసుని సమాధానపరుచుకోడానికే దారితీస్తుందనీ విమర్శకుడు చెప్తే, మనమప్పుడు ఆ చిత్రాన్ని కొత్తగా చూడటం మొదలుపెడతాం. అంతదాకా అందులో కనిపించని గంభీర తాత్త్వికత ఏదో మనకి కొత్తగా కనిపించడం మొదలవుతుంది.
అప్పుడు మనం మరొకరికి ఆ చిత్రాన్ని పరిచయం చేస్తూ, ‘చూడు, ఇదొక క్లాసిక్, చిన్నపిల్లవాడు గీసినట్టు అనిపిస్తోంది కదూ, కాని ఇందులో చాలా లోతైన అర్థముంది..’ అంటో చెప్పడం మొదలుపెడతాం.
కానీ, నిజంగా ఆ చిత్రలేఖనంలో అదంతా ఉందా? లేక ఆ విమర్శకుడు మనకొక కథనాన్నిస్తున్నాడా? నిజంగా ఆ చిత్రలేఖనం కళాఖండమేనా? చెప్పడం కష్టం.
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, నాలుగైదు రోజుల కిందట, మిత్రుడు నవీన్ నూనె అమెరికాలో జోషువా బెల్ అనే ప్రసిద్ధ వాయులీన విద్వాంసుడి కచేరీ విన్నానని ఒక పోస్ట్ పెడితే, దాని మీద వ్యాఖ్య చేస్తూ వి.చౌదరి జంపాల గారు ఒక వార్తాకథనం లింక్ అక్కడ పోస్ట్ చేసారు. ఆ వార్తాకథనం నన్ను చాలా ఆలోచనలో పడేసింది. నేనే కాదు, రసజ్ఞులంతా చర్చించుకోవలసిన విషయమెంతో ఉందందులో. ముఖ్యంగా, ఏది కళ, ఏది సౌందర్యం, ఎవరు సహృదయుడు మొదలైన ప్రశ్నలమీద గత రెండువేల ఏళ్ళుగా ప్రాచ్య, పాశ్చాత్య ఆలంకారికులంతా మాట్లాడినమాటలన్నీ మనం మరొకసారి చర్చించుకోవలసిన విషయముంది.
కాని, బహుశా, ఆ వార్తాకథనం నిడివి చాలా ఎక్కువగా ఉన్నందువల్లనేమో (దాదాపు 25 పేజీల పైనే)ఎవరూ దానిమీద ప్రతిస్పందించలేదు (ఒక్క కన్నెగంటి రామారావు తప్ప). (కాని ఇది తెలుగువాళ్ళ పరిమితి అని అనుకోవలసిన పనిలేదు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రచురించిన ఆ వార్తకథనానికి కూడా ఇప్పటిదాకా 9 కామెంట్లే వచ్చాయి!)
ఆ లింక్ మళ్ళా ఇక్కడ పొందుపరుస్తున్నాను, కళమీదా, సౌందర్యశాస్త్రం మీదా అభిరుచి ఉన్నవాళ్ళంతా దాన్ని ఆసాంతం చదవాలని నా కోరిక. మీరు చదివాక, దాని మీద మనం మాట్లాడుకోవలసిన విషయం చాలా ఉంది.
ఆ వార్తాకథనంలో అంశం స్థూలంగా ఇది:
ఒక సుప్రసిద్ధ వాయులీనవిద్వాంసుడు అనామకంగా రోడ్డుమీద ఒక మూల క్రీనీడలో నిలబడి అత్యద్భుతమైన సంప్రదాయ సంగీతాన్ని వినిపిస్తే, ఆ వినిపిస్తున్నది ఎవరో తెలియకపోతే, ప్రజలు అతణ్ణి గుర్తుపట్టనప్పుడు, ఆ సంగీతాన్ని అతడెవరో తెలిస్తే వినేటంత క్రేజ్ తోనూ వింటారా? ఆ సంగీతం వింటూ అక్కడే నిల్చిపోతారా? పేరుతో, ప్రచారంతో, విమర్శకుల, వ్యాఖ్యాతల సహకారంతో నిమిత్తం లేకుండా ప్రజలు గొప్ప కళని తమంత తాము గుర్తుపట్టగలుగుతారా? ఆ ప్రజలు కూడా, అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో,ఆ దేశరాజధానిలో, అది కూడా ప్రభుత్వకార్యాలయాల్లో పనిచేసే విద్యాధిక శ్రోతలైతే, వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుంది?
ఊహించండి.
ఈ ప్రశ్నలకి సమాధానాన్ని అన్వేషిస్తూ 2007 జనవరి 12 న పొద్దున్నే 7.51 కి ఒక ప్రయోగం చేపట్టారు. జోషువా బెల్ సుప్రసిద్ధ వాయులీన కళాకారుడు. ఆ రోజుకి సరిగ్గా మూడురోజులముందు, అతడొక కచేరీ నిర్వహిస్తే, టిక్కెట్టుకి వందడాలర్లు పెట్టి మరీ జనం విరగబడి విన్నారు. అతడి కార్యక్రమాల్ని స్పాన్సర్ చేసేవాళ్ళ లెక్కప్రకారం ఆ రోజుల్లో అతడి సంగీతానికి నిమిషానికి వెయ్యిడాలర్ల ఆదాయం వస్తుంది.
కానీ, ఆ రోజు పొద్దున్న మేట్రో స్టేషన్లో ఒక మూల గోడకానుకుని, తన ముఖమ్మీదకి టోపీ లాక్కుని, తనముందొక పట్టా పరిచి దానిమీద కొంత చిల్లర పరిచి, అతడు సంగీతం వినిపించడం మొదలుపెడితే..
43 నిమిషాలపాటు మహత్తరమైన ఆరు సంప్రదాయ కృతుల్ని అతడు రెండువందల ఏళ్ళ వయసుగల తన అపురూపమైన వాయులీనం మీద వినిపిస్తే..
జరిగిందేమిటి?
మొత్తం 1097 మంది ఆ దారిన నడిచివెళ్ళగా, పూర్తిగా ఆగి విన్నది ఒక్కరు మాత్రమే. ఆ కళాకారుడు తన అనామక కచేరీ ముగించేటప్పటికి అతడిముందు పరిచిన పట్టా మీద పోగైన మొత్తం సొమ్ము32 డాలర్ల చిల్లర మాత్రమే!
అంటే ఏమిటి?
అతడు వినిపించింది సంగీతం కాదా? ఆ దారినవెళ్ళినవాళ్ళకి సంగీత జ్ఞానం లేదా? అక్కడ రసోత్పత్తి సంభవించలేదా? అసలు రసం ఎక్కడుంది? కళాకారుడిలోనా? ఆ కృతిలోనా లేక శ్రోతలోనా? అసలు సౌందర్యమంటే ఏమిటి? ఈ కథనంలోనే పేర్కొన్నట్టుగా, అది లీబ్నిజ్ చెప్పినట్టు కేవలం యథార్థమా లేక డేవిడ్ హ్యూమ్ భావించినట్టుగా కేవలం వ్యక్తిగత అభిప్రాయమా లేక కాంట్ వివరించినట్టుగా ద్రష్ట అనుభవిస్తున్న మనఃస్థితినా?
రచయిత ఎవరో తెలియకుండా, రచన చదివి దాని వైశిష్ట్యం గ్రహించడం, మాన్యుస్క్రిప్టు చదివినప్పుడే, ఆ రచన రానున్నరోజుల్లో ప్రభావశీలంగా ఉండగలదని ఊహించడం మామూలు విషయాలు కావు. ఒక చిత్రలేఖనాన్ని ఫ్రేములోంచి బయటకు తీసి, మ్యూజియం బయట చూసికూడా అది గొప్ప చిత్రలేఖనం అని చెప్పగలమా? అసలు, గొప్ప కళని మనంతట మనం నిజంగా గుర్తుపట్టగలమా?
కాని ఒక మాట మాత్రం చెప్పాలి. ఆ సంగీతాన్ని నిజంగా పూర్తిగా ఆస్వాదించిన ఒక సహృదయుడు అక్కడ మనకు కనబడ్డాడు. వార్తాకథనం అతణ్ణి cultural hero of the day అంది. అతడు బెల్ సంగీతానికి అభిమాని. కాని అతడు బెల్ ని గుర్తుపట్టలేకపోయాడు, తాను వింటున్నది బెల్ సంగీతమని కూడా గుర్తుపట్టలేకపోయాడు. కాని, ఆ సంగీతాన్ని పూర్తిగా, సంతోషంగా, పరిపూర్ణతాదాత్మ్యంతో విన్నాడు. ఆ రత్నపరీక్షకుడు అక్కడ ప్రత్యక్షం కాకపోయుంటే, బహుశా,ఈ వార్తాకథనం నన్ను అపారమైన నిస్పృహలోకి నెట్టేసి ఉండేది. కాని, ఒకడున్నాడు, ఒకడుంటాడు, కనీసం ఒకడు. అటువంటివాడిమీద ఆశపెట్టుకునే భవభూతి ‘కాలోహ్యయం నిరవధిః, విపులాచ పృథ్వీ’ అన్నాడు.
మరొక మహత్తరమైన విషయం, ఆ సంగీతాన్ని విన్న పసిపిల్లందరూ ఆగిపోవడమో, లేక వారి నడక మందగించడమో జరగడం. అట్లా పిల్లలు ఆ సంగీతం దిశగా వెనక్కి లాగుతుంటే, వాళ్ళ తల్లులో, తండ్రులో వాళ్ళని బలవంతంగా ముందుకు లాక్కుపోవడం!
ఆ సంగీత ప్రేమికుడూ, ఆ పిల్లలూ ఈ ప్రపంచం మీద నాకెంత ఆశకలిగించారని!
27-10-2017