‘ఒక వైపు నుంచి చూస్తే శివుడు సన్నని నెలవంక లాగా కనిపిస్తాడు.’
ఈ మాటలన్నది మాణిక్యవాచకరో, అక్కమహాదేవినో, శ్రీనాథుడో కాదు, ఆధునిక ఫ్రెంచి మహాశిల్పి అగస్టె రోడె (1840-1917).
డెబ్భై ఏళ్ళ వయసులో, 1911 లో, ప్రపంచంలోనే అత్యున్నతుడైన శిల్పిగా ప్రఖ్యాతి చెందిన వేళ, రోడేకి మిత్రుడొకాయన 27 ఫొటోలు పంపించాడు. చెన్నై మూజియంలో ఉన్న రెండు నటరాజ శిల్పాల ఫొటోలు అవి. ఆ మిత్రుడు రష్యన్ పురాతత్త్వవేత్త విక్టర్ గొలోబెఫ్. అతడు రోడేకి ఆ ఫొటోలు పంపించి వాటి గురించి ఒక పత్రికకి ఏదైనా వ్యాసం రాయమని అడిగాడు.
రోడే ఆ ఫొటోలు చూసినప్పటి తన అనుభూతిని ఆ ఫొటోల వెనకపక్కనే చిన్నచిన్న వాక్యాలుగా రాసాడు. అది కూడా రెండేళ్ళ తరువాత, 1913 లో. కాని అవి కేవలం వాక్యాలు కావు. అత్యున్నత స్థాయి కవితలు.
సరిగ్గా ఆ సమయంలోనే రోడే ఫ్రెంచి కెతడ్రల్ కట్టడాల మీద ఒక పుస్తకం రాస్తూ ఉన్నాడు. నటరాజ శిల్పాల ఫొటోల వెనక రోడే రాసిన వాక్యాలు కొన్ని The cathedrals of France (1914) లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెంచి కెతడ్రల్ నిర్మాణాల మీద రోడే తన అనుభూతిని వ్యక్తం చేయడానికి మొదట్లో ఒక సింబలిస్టు కవినీ, తర్వాత రోజుల్లో రేనర్ మేరియా రిల్కనీ సహాయకులుగా పెట్టుకున్నాడు. కాబట్టి కెతడ్రల్ నిర్మాణాలమీద రోడే అభివ్యక్తిలోని కవితాత్మకతకి ఆ కవులు కూడా చాలావరకూ కారణమని చెప్పాలి. కాని నటరాజమూర్తుల్ని చూసినప్పుడు రోడే ప్రకటించిన పారవశ్యం, కవితాభివ్యక్తి అతడి స్వంతం. పూర్తిగా పండిన ఒక జీవితకాలపు కళాభివ్యక్తి చేరుకున్న చరమసీమ అది. బహుశా, అత్యుత్తమ భారతీయ కవిత్వానికి సరితూగగల రచన అది.
1921 లో ఒక పత్రికలోనూ, 1998 లో మరొకసారీ అసంపూర్తిగా ప్రచురించబడిన ఆ రచనను Rodin and the Dance of Shiva (నియోగి బుక్స్, 2016) పేరిట, ఇప్పుడు మరింత సమగ్రంగా వెలువరించారు.
ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన కతియా లెగెరెట్ మనోఛాయ పారిస్ విశ్వవిద్యాలయంలో రంగస్థలశాస్త్రాన్ని బోధిస్తున్నది. నటరాజమూర్తి పైన రోడే రాసిన కవితాభివ్యక్తి పూర్తి పాఠంతో పాటు ఆయన రచన వెనక ఉన్న ప్రభావాలనూ, రోడే జీవితకాల అన్వేషణనీ, దాహార్తినీ పదకొండో శతాబ్ది చోళ శిల్పాలరూపంలో శివుడెట్లా తీర్చాడో ఆమె ఈ పుస్తకంలో ఎంతో సమగ్రంగా వివరించింది.
మొత్తం 7 ఖండికలుగా ఉన్న ఆ శివకవితనంతటినీ ఇక్కడ తెలుగులోకి తేకుండా ఉండలేకపోయాను. నటరాజమూర్తిని చూడగానే రోడే అనుభవించిన తాదాత్మ్యత, అపూర్వ ప్రశాంతి, ఆత్మసాక్షాత్కారాల్ని వ్యక్తం చేస్తున్న ఆ ఖండికల్లో ప్రతి ఒక్క వాక్యమూ విలువైనదే.
శివుణ్ణి పూర్తిగా చూసినప్పుడు
జీవితం పరిపూర్ణంగా వికసించినప్పుడు, జీవితప్రవాహం, వాయుప్రసారం, సూర్యుడు, అస్తిత్వ స్పృహ పొంగిపొర్లిపోతూండటం చూస్తున్నాను. దూర ప్రాచ్య కళ మనముందు ప్రత్యక్షమైనప్పుడు మనకి కలిగే అనుభవమిది.
ఆ సమయంలో మానవదేహం ఒక దివ్యస్వభావాన్ని సంతరించుకుంటుందని చెప్పవచ్చు. అంటే అప్పుడు మనం మన ప్రాదుర్భావవేళలకి సన్నిహితంగా జరిగామని కాదు, ఎందుకంటే మనదేహాలు ఈ ఆకృతికి ఎప్పుడో చేరుకున్నాయి, కాని మనం వర్తమానానికి దాస్యం చెయ్యనవసరం లేని స్థితికి చేరుకోగలమని నమ్మాం కాబట్టి, స్వర్గలోకంలోకి తేలిపోగలిగాం కాబట్టీ అది సాధ్యపడింది, కానీ ఆ సంతోషానికి మనం నిజంగా దూరమైపోయాం..
ఒక కోణంలోంచి చూస్తే, శివుడు సన్నని నెలవంక.
ఎటువంటి ప్రతిభ, దేహాకృతి పట్ల ఎంత పారవశ్యం!
ఇప్పుడిది కాంస్యంలో స్థిరీకరించబడ్డ శాశ్వత సౌందర్యం. అగ్రాహ్య కాంతివిన్యాసం. శిల్పం మీద పడుతున్న వెలుగు ఎటు జరిగినా ఆ కాంతికిరణాల్లో ఈ నిశ్చల కండరాలు గొప్ప చలనంగా మారిపోడానికి సిద్ధంగా ఉన్నాయా అనిపిస్తున్నది.
ఎంతోకాలంగా చీకటిలో ఉన్న ఈ శిల్పం మీద నీడలు మరింత మరింత దగ్గరగా జరిగి ఈ కళాకృతిని ఆవహించి దీనికొక శీతలలావణ్య సమ్మోహనీయతని చేకూర్చనున్నాయా అనిపిస్తున్నది.
ఈ కృతి పరిపూర్ణతపొందినట్టు ఎట్లాంటి సూచనలు లభిస్తున్నవి! ఈ దేహాకృతి ఎటువంటి పొగమంచులాగా ఉంది! ఒక దివ్యాదేశం ప్రకారం తీర్చిదిద్దినట్టుంది. ఎట్లాంటి ఉల్లంఘనా లేదు. ప్రతి ఒక్కటీ ఉండవలసిన స్థానంలోనే ఉన్నట్టుంది. ఆ భుజస్కంధాన్ని పరిశీలిస్తే, ఆ మోచేయి విశ్రాంతిలో కూడా చలిస్తున్నట్టే కనిపిస్తున్నది. ఆ భుజస్కంధమెట్లా ముందుకు చొచ్చుకు వచ్చిందో, ఆ ఉరఃపంజరం, ఆ పక్కటెముకలు ఆ రెక్క ఎముకను ఎంత ఆరాధనీయంగా అతుక్కుని, ఏ క్షణాన్నాయినా చలించడానికి ఎట్లా సంసిద్ధంగా ఉన్నాయో. ఆ దేహపార్శ్వం ఇంతలో సన్నగా, ఇంతలోనే బిగువుగా, ఆ పైన రెండు ఊరువులుగా విస్తృతమవుతూ, రెండు దండాలుగా, పరిపూర్ణ కోణాకృతిలో కుదురుకున్న రెండు తులాదండాలుగా నేలమీద నడయాడడానికి సిద్ధంగా ఉన్న కాళ్ళు…
శివుణ్ణి మరొకవైపు నుంచి చూసినప్పుడు
ఆయన వక్షస్థలాన్నీ, ఉదరాన్నీ వేరు చేస్తున్న ఆ రెండు చేతులూ ఆరాధనీయంగా ఉన్నాయి. ఆ భంగిమ తన శోభలో మెడిచిలో ఉన్న వీనస్ మూర్తి తో పోటీ పడగలిగేదిగా ఉంది. ఆమె తన హస్తాల్తో తన సౌందర్యాన్ని కప్పుకున్నట్టుగా శివుడుకూడా గొప్ప నేర్పుతో తనని తాను కాపాడుకుంటున్నాడు.
మెడకిందా, కటి పైనా ఉండే ఆ శరీరభాగాన్ని కుడివైపు నీడ రెండుగా విభజిస్తూ, ఊరువులపొడవునా కిందకి జారుతూ ఒక భాగాన్ని వెలుగునీడల్లోనూ మరొకభాగాన్ని పూర్తి అస్పష్టతలోనూ కప్పివేస్తున్నది. ఆ గూఢతలో కటిప్రదేశం పూర్తిగా కప్పబడిపోయింది.
ఒక్క మాటలో చెప్పాలంటే, అది ఆకృతిలోని లోతులు, వైరుధ్యాలు, సూక్ష్మత, ద్రవ్యరాశి చూపిస్తున్న విశేషం. చలనంతో సంబధమే లేకపోతే, ఆ వివరాలూ, విశేషాలూ వాటికవి నిరర్థకంగానూ, పటాటోపంగానూ మిగిలి పోయి ఉండేవే.
ఆ దీర్ఘకండరాల జంఘికల్లో ఉన్నది వేగం మటుకే.
ఆ ఊరువులు ఒకదానికొకటి దగ్గరగా రెండింతలు మురిపంగా ఒక రహస్యాన్ని ఆచ్ఛాదిస్తున్నవి ఒకింత మత్సరగ్రస్తంగా. ఆ ఔర్వభూమి మీద పడుతున్న వెలుగువల్ల ఆ సుందర ఛాయాస్థలం మరింత సుస్పష్టమవుతున్నది.
శివుణ్ణి ముఖాముఖి చూస్తూ
ఈ భంగిమ కళాకారులకి తెలిసినదే, కాని అదే సమయంలో అసాధారణమైంది కూడా. ఎందుకంటే ప్రతి భంగిమ కూడా స్వాభావికంగా కనిపిస్తున్నప్పటికీ, మనకీ, తనకీమధ్య ఎంత దూరం! కొంతమంది చూడలేనిదేదో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది: ఆ తెలియరాని లోతులు, జీవితం తాలూకు లోతులవి. ఆ సొగసులో ఒక అనుగ్రహం ఉంది. ఆ అనుగ్రహం మీద ఆధారపడి ఒక ఆదర్శం ఉంది. ఆ అనుభూతికి అంతు లేదు. అది ఉదాత్తంగా ఉందనిపిస్తుంది మనకి. వట్టి ఉదాత్తత మాత్రమేనా, కాదు, అత్యంత శక్తిమంతమైన ఉదాత్తత, ఏమో, మాటలు చాలడం లేదు..
ఆ భుజస్కంధం మీంచి కటిబంధందాకా, నీడలు పూలమాలల్లాగా పరుచుకున్నాయి, తిరిగి మళ్ళా కటిబంధం మీంచి ఊరువుల మీదకి సమకోణాకృతిలో..
శివుడికి మరొకవైపునుండి ముఖాముఖిగా
ఆ రెండు కాళ్ళ మీదా కాంతి వేరు వేరుగా పడుతున్నందువల్ల ప్రతి ఊరువు ఛాయా రెండవకాలు పైన పరుచు కుంటున్నది.
ఆ ఆకృతిని లోపలనుంచీ తీర్చిదిద్దకపోయి ఉంటే ఆ రేఖాకృతికి అంత తేమ, అంత మెత్తదనం సాధ్యమై ఉండేవి కావు. ఇట్లా నేరుగా నీడ పడుతున్నప్పుడు ఆ దేహం మరింత పొడిపొడిగా తేలిపోయిఉండేది.
ఈ శిల్పం అనాగరిక కళ అనేవాళ్ళ విషయంలో
అజ్ఞాని దేన్నైనా తేల్చిపారేయ్యాలనుకుంటాడు, అతడి చూపు చాలా మొరటుగా ఉంటుంది. చాలా తక్కువ రకం ఇష్టం కోసం అతడు అత్యున్నమైన కళాకృతినుంచి జీవాన్ని లాగెయ్యాలని చూస్తాడు. చివరికి ఏదీ చూడలేకపోతాడు, దేన్నీ పొందలేక పోతాడు. నిజంగా ఆసక్తి పుట్టాలంటే, నిజంగా చూడాలంటే, మనం మరింత అధ్యయనం చెయ్యాల్సి ఉంటుంది..
శివవదనాన్ని మరింత ధ్యానపూర్వకంగా చూసాక
ఆ నోరు బాగా కొట్టొచ్చినట్టుగా ఉంది, ఒక ఇంద్రియాసక్త సంతోషం అక్కడ అతిశయించి కనిపిస్తోంది.
కోమలమైన ఆ నోరు, ఆ నేత్రాలు ఒకదానికొకటి సరితూగుతున్నాయి.
ఆ పెదాలు సంతోషసరోవరంలా ఉన్నాయి, వాటిని ఆనుకుని ఆ ముక్కుపుటాలు ఆభిజాత్యంతో కంపిస్తున్నాయి.
ఆ నోరు ఆస్వాదయోగ్యమైన ఆర్ద్రతలో ఓలలాడుతున్నది, పాములాగా వంకర తిరిగింది, ఆ నేత్రాలు మరింత విశాలంగా కన్రెప్పల మధురపేటికలో ముకుళితమయ్యాయి.
ఆ వదనవేదిక మీద నాసిక పూర్తిగా రెక్కలు విప్పుకుంది.
వాక్కుని సృజించే ఆ అధరాలు, కదుల్తూనే తప్పించుకుపోయేలా ఉన్నవి, ఎటువంటి సర్పవిన్యాసం!
ఒక రేఖానైర్మల్యంలో ఆ నేత్రాలు ఒదిగిపోయాయి. నక్షత్రమండలాల నిశ్శబ్దంవాటి చుట్టూ. అక్షుభిత నేత్రాలవి. అదంతా ఒక ప్రశాంత చిత్రలేఖనం, ప్రశాంతమానసం పొందే శమదమాల సంతోషం.
ఈ రేఖాలాస్యమంతా వంపు తిరిగి చుబుకం దగ్గర చేరి ఆగింది.
ఆ అభివ్యక్తి అట్లా కొనసాగి ముగిసిపోయే చోట మరొక చోటమళ్ళా కొత్తగా మొదలయ్యింది. నోరు చూపిస్తున్న చలనం కపోలాల్లో అదృశ్యమయ్యింది.
చెవులనుంచి ముందుకు సాగిన వక్రరేఖ ఒకవైపు నోటిదగ్గరా మరొక వైపు నాసికాపక్షాలదగ్గరా చిన్న వంపు తిరిగింది. నాసిక కిందుగా, చుబుకాన్ని చుట్టి చెంపలమీదుగా వంపు తిరిగిన ఒక వృత్తమది.
ఆ ఎత్తైన కపోలాలు కూడా వంపుతిరిగాయి.
ఆ అనర్గళ శివవదన సన్నిధినించి ముందుకు జరగడానికి కాళ్ళు రానప్పుడు
ఆ నేత్రం తన తోటి నేత్రానికి జోడుగానే నిలిచిఉన్నది, సముచితమైన స్థానంలో, ఒకవైపు లాలసతో, మరొకవైపు తేజస్సుతో.
ఆ నిమీలిత నేత్రాలు, కాలం గడుస్తున్న సంతృప్తితో.
ఆ నేత్రాల్ని ఎంతో కచ్చితంగా చిత్రించారు, అమూల్యమైన మెరుగుతో.
కనురెప్పల రత్నపేటికలో ఆ నేత్రాల్ని పొదిగారు, ఆ కనుబొమల ధనురాకృతి, ఉదారమైన ఆ అధరం.
ఆ నోరు మధురోహల గుహ, కాంక్షాగ్నిశిఖరం కూడా.
ఎన్నో శతాబ్దాలుగా ఈ కాంస్యంలో బిగించబడ్డ ఒక ఆత్మభౌతికత, ఆ పెదాలమీద అనంతత్వ వాంఛ, ఆ నేత్రాలు చూస్తున్నాయి, మాట్లాడుతున్నాయి కూడా.
అనంతకాలంగా ప్రాణం ఆ నోటిగుండా లోపలకీ, బయటికీ వస్తూపోతూనే ఉంది, తుమ్మెదలు వస్తూ,పోతూన్నట్టుగా, ఒక అవిరామ, మధుర, సుగంధమయ శ్వాసక్రియ.
ప్రేమాస్పదమైన ఈ అంతర్హిత ముఖభంగిమకి తనదైన ఒక ముఖభంగిమ ఉన్నది, అక్కడ అభివ్యక్తి ముగిసిపోయి లోపలకి చొచ్చుకుపోతున్నది, ఇక అక్కడ మిగిలినదల్లా గ్రీవనాడీతంత్రుల్లో కలిసిపోతున్న కపోల వక్రరేఖల సమ్మోహనీయశోభ మాత్రమే.
***
నటరాజమూర్తి విగ్రహాల ఫొటోలు చూసినప్పుడు రోడే కి భారతీయ శిల్పకళ గురించి గానీ, శివుడిగురించి గానీ, శైవసాహిత్యం గురించి గానీ, భరతముని గురించిగానీ, నాట్యశాస్త్రం గురించిగానీ ఏమీ తెలీదు. నటరాజ తాండవం గురించి ప్రపంచానికి పరిచయం చేసిన ఆనందకుమారస్వామి రచన The Dance of Shiva అప్పటికి రానేలేదు. రోడే వ్యాసం ప్రచురితమైన పత్రికలోనే హావెల్, కుమారస్వామిలు రాసిన వ్యాసాలు కూడా ప్రచురితమయ్యాయిగానీ, వాటిని రోడే చదివి ఉండే అవకాశం లేదు. చదివినా కూడా కుమారస్వామి సాహిత్య, వాజ్మయ ఆధారాలబట్టి నటరాజుని వివరించే ప్రయత్నం చేసాడు తప్ప, శిల్ప శాస్త్రం ప్రకారం కాదు.
ఈ నేపథ్యంలో తనముందున్న, ఒక సుదూరసీమనుంచి నుంచి వచ్చిన శిల్పకళాకృతుల ఛాయాచిత్రాల్ని చూసి రోడే ఆ శిల్పం వెనక ఉన్న ఆ తత్త్వశాస్త్రానికి అంత సన్నిహితంగా ఎలా రాగలిగేడు?
నటరాజుని చూసి రోడే సమ్మోహానికి గురైతే,ఆ ప్రశస్తి భారతీయ శిల్పకళకి మాత్రమే కాదు, రోడే ది కూడా. నటరాజు గురించీ, శివతాండవం గురించీ మన కవులు కవిత్వం రాయడంలో విశేషమేమీ లేదు. ఎందుకంటే, ఈ విజ్ఞానం, ఈ రహస్యాలు, ఈ ఆధ్యాత్మికత ఇదంతా మనకి వారసత్వంగా అందిన సంపద. మన తండ్రి ఆస్తిని మనం యథేచ్ఛగా ఎలానూ వాడుకుంటాం. కాని ఈ భావాలూ, ఈ వివరాలూ ఏమీ తెలియని ఒక విదేశీ శిల్పకారుడు తనముందున్న కేవల ఛాయాచిత్రాలు ఆధారంగా ఆ తేజోమయమూర్తిని సంభావించగలిగాడంటే, అదెంత ఆశ్చర్యకరం! ఆ శిల్పి ఎంత అన్వేషణాపరుడు, ఎంత ఆత్మపరితప్తుడు అయిఉండాలి!
ఆత్మలోతుల్లోంచీ ఆ శివవిగ్రహం ముందు రోడే మోకరిల్లడం వెనుక ఎటువంటి ప్రభావాలుండి ఉండవచ్చో, ఈ పుస్తక సంపాదకురాలు మనోఛాయ చాలా సమగ్రంగా వివరించే ప్రయత్నం చేసింది. ఆమె చెప్పినదాని ప్రకారం, ఆ నటరాజమూర్తుల్ని పరిశీలించడానికి రోడే ముందున్న ఆధారాలు, అంతకు అయిదారేళ్ళ ముందు ఆయన్ని గాఢంగా ఆకర్షించిన కంబోడియా నాట్యాలు, ఫ్రాన్సు కెతడ్రల్ నిర్మాణాలు, ప్రాచీన వీనస్ భగ్న మూర్తి, ఇక అతడు తన జీవితమంతా మనసులోనూ, దేహంలోనూ అనుభవించిన సంక్షోభాలూ మాత్రమే.
రోడేని జీవితమంతా కాల్చుకు తిన్న కామాసక్తి, ఇంద్రియలోలత్వాల నేపథ్యంలో ఈ శివసందర్శనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కంబోడియా నర్తకీమణుల నాట్యాన్ని చూసిన తరువాత, అతడు వారి నాట్యభంగిమల్ని రేఖాచిత్రాలుగా చిత్రించడానికి ఉత్సాహపడ్డాక, అతడి జీవితపు చివరి సంవత్సరాల్లో కొత్త అధ్యాయం మొదలయ్యింది. చివరి ఏడెనిమిదేళ్ళల్లో అతడు సుమారు 8000 రేఖాచిత్రాలు గీసాడంటే ఆ ఆర్తి, ఆ తపన ఎటువంటివో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రేఖాచిత్రాలన్నిటా అతడు ప్రధానంగా స్త్రీ రహస్యాంగాల్నే చిత్రిస్తూపోయేడు. పేదరికంలో గడిచిన బాల్యం, తనని తాను నిలదొక్కుకోడానికే జీవితం అధికభాగం ఖర్చయిపోయిన తర్వాత, జీవితం కొద్దిగా స్తిమితం ఇచ్చాక, అతడు తనకోసం తాను చిత్రించుకున్నది ఆ స్త్రీ రహస్యావయవాల రేఖాచిత్రాలు మాత్రమే. దాదాపు పొర్నొగ్రఫీలాగా ముద్రపడ్డ ఆ చిత్రలేఖనాలద్వారా అతడు అన్ని రకాల కట్టుబాట్లనీ దాటి తన ఒంటరితనంలో తనని తాను ఎదురేగి స్వాగతించుకుంటూ ఉన్నాడు.
ఫ్రెంచి మహారచయిత బాల్జా విగ్రహం చెక్కమని అతణ్ణి ఫ్రెంచి రచయితల సంఘం అడిగితే, అతడు బాల్జా శిరసునే కాక, మొండేన్ని కూడా చిత్రించేడు. ఎందుకంటే, బాల్జా పూర్తి ఇంద్రియలోలత్వంలో శిరసుతోమాత్రమే కాక, దేహంతో కూడా జీవించాడని రోడే భావించాడు. ఆ శిల్పంలో శిరసు కింద దేహమంతా బాల్జా ఒక అంగీకప్పుకున్నట్టుగా చిత్రిస్తూ, ఆ అంగీలో అతడు తన ఉద్రిక్త శిశ్నాన్ని ఎడమచేత్తో అదుముకుంటున్నట్టుగా కూడా రోడే చిత్రించాడు. ఫ్రెంచి సాహిత్య, కళాప్రపంచాన్ని నిర్ఘాంతపరిచిన ఆ శిల్పాన్ని రోడే అట్లానే తీర్చిదిద్దడంలో ఉద్దేశ్యమేమిటి? బాల్జాతో తనని తాను ఐడెంటిపై చేసుకోవడమే కదా.
రోడే తన జీవితకాలం పొడుగునా స్త్రీదేహమనే ఒక రహస్యాన్ని, ఒక అద్భుతాన్ని, ఒక విభ్రాంతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి ఫ్రెంచి కెతడ్రల్ కూడా అతడికి మోకరిల్లి ప్రార్థన చేస్తున్న స్త్రీలానే కనిపించింది. ఆ వెతుకులాటలో, ఆ నలుగులాటలో, తన జీవితపు చివరిసంవత్సరాల్లో అతడికి శివుడు కనిపించాడు.
రోడేకి అర్థనారీశ్వర తత్త్వం గురించి తెలియదు. కానీ, సుందరశివమూర్తిని వర్ణించేటప్పుడు అతడికి వీనస్ గుర్తు రావడం యాదృచ్ఛికం కాదు. శివుడిలో అతడు ఏకకాలంలో ఒక స్త్రీనీ, ఒక పురుషుణ్ణీ, స్త్రీ, పురుష వైరుధ్యాన్ని దాటిన ఒక మహామూర్తినీ కూడా చూడగలిగాడు. ఆ శివవదనంలో ఏకకాలంలో ఒక మధురోహల గుహనీ, ఒక చండాగ్నిశిఖనీ కూడా చూడగలిగాడు. తనని జీవితమంతా వేధిస్తూ వచ్చిన దేహాకృతుల నీడల్నీ, ఆ నీడల్ని కప్పిపుచ్చగల తేజస్సునీ అతడు ఏకకాలంలో శివసన్నిధిలో అనుభవించగలిగాడు. అందుకనే, ఆ శివమూర్తిని చూడగానే, అతడికి శిల్పం, నాట్యం, వాస్తు, కవిత్వం, చిత్రలేఖనం అన్నీ ఒక్కటైపోయాయి.
ఆ నటరాజమూర్తి రూపొందిన దేశమూ, సంస్కృతీ మనవి కావడం మనం గర్వించదగ్గ విషయమే అయినా, ఆ సౌందర్యం గురించి మనకేమీ తెలీదనే చెప్పాలి. ఎందుకంటే మనకి అటువంటి తపన లేదు, అటువంటి తీవ్రాన్వేషణలో మనమెప్పుడూ దగ్ధం కాలేదు. వెయ్యేళ్ళ కిందటి ఒక అజ్ఞాత తమిళశిల్పకారుడెవరో అటువంటి తపనలో దగ్ధమై, శివసందర్శన భాగ్యంపొంది తన సందర్శనాన్ని శిల్పంగా మలిచాడు. వెయ్యేళ్ళ తరువాత, ఖండాంతరాల ఆవల అటువంటి ఉన్మత్త శిల్పకారుడొకడికి ఆ భాష బోధపడింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మనం చెయ్యగలిగిందల్లా ఆ సంభాషణ విన్నాక వినయంగా శిరసువంచడమే.
31-5-2017